సుద్దపల్లి లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం సుద్దపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పూర్వ విద్యార్థి వినోద్ రెడ్డి సౌజన్యంతో పరీక్షా సామాగ్రిని (రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. తమ చదివిన పాఠశాల మీద మమకారంతో విద్యార్థులకు అండగా నిలిచిన పూర్వ విద్యార్థి వినోద్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు.
ఇంచార్జీ ఎంఈఓ నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయికి దీటుగా రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్ల క్రాంతి కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు మహేశ్వర్, శంకర్, సుదర్శన్, రాంపవన్, నాయకులు భుమన్న, చిరంజీవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
