ఈత సరదా ముగ్గురి స్నేహితుల ప్రాణాలను బలి గొంది.సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంద. నాచారం సమీపంలోని హల్దీ వాగులో స్నానానికి దిగి ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు .
స్థానికుల సమాచారం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన ఎర్రగుళ్ల ప్రశాంత్ (27), వికాస్ (27), కొంతమి ఆనంద్ రెడ్డి (27)లు బుధవారం తూప్రాన్ లో జరిగిన ఒక వివాహ వేడుకకు వెళ్లారు.
పెళ్లి వేడుక ముగించుకుని తిరుగు ప్రయాణమైన వీరు.. మార్గమధ్యలో నాచారం వద్ద ఉన్న హల్దీ వాగును చూసి సేదతీరాలని భావించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం స్నానం చేద్దామని వాగులోకి దిగగా, నీటి లోతును అంచనా వేయలేక ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు.
స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు.
