రుద్రూర్ జేఎన్సీ కాలనీలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బీజేపీ జిల్లా కార్యాలయం వేదికగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బాధితులను పరామర్శించేందుకు రుద్రూర్ బయలుదేరుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారిని, పార్టీ నాయకులను నాలుగవ టౌన్ పోలీసులు కార్యాలయం వద్దే అడ్డుకున్నారు.
శాంతిభద్రతల దృష్ట్యా రుద్రూర్ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్రమంగా అడ్డుకుంటున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని దినేష్ పటేల్ హెచ్చరించారు.
