కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో తప్పుడు మార్గంలో వెళ్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి విమర్శించారు.నిజామాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నీట్ పరీక్షల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని గత నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్రం స్పందించకుండా విద్యార్థులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.శాంతియుతంగా న్యాయం చేయమని అడిగిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరుగుతున్న అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ప్రజాస్వామ్య దేశంలో వాస్తవాలు మాట్లాడితే అరెస్టులు, లాఠీచార్జిలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది బ్రిటిష్ పాలనను మించేలా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు.విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడడం వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.
దేశ భవిష్యత్తు అయిన ఆ విద్యార్థుల న్యాయమైన కోరికలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తామని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయబ్ బిన్ హమ్దాన్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పాడిపెల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
