HomePOLITICAL NEWSపీఎం శ్రీ అమలు తీరు భేష్‌..కేంద్రీయ విద్యాలయ వసతులపై కేంద్ర జాయింట్ సెక్రటరీ సంతృప్తి..

పీఎం శ్రీ అమలు తీరు భేష్‌..కేంద్రీయ విద్యాలయ వసతులపై కేంద్ర జాయింట్ సెక్రటరీ సంతృప్తి..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పీఎం శ్రీ’ పథకం అమలులో నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర టెలి కమ్యూనికేషన్ల శాఖ జాయింట్ సెక్రటరీ దేవేంద్ర కుమార్ రాయ్ ప్రశంసించారు.

శుక్రవారం ఆయన నగరంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను, విద్యా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పాఠశాలలోని స్మార్ట్ క్లాస్ రూములు, డిజిటల్ ల్యాబ్‌లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఆయన నిశితంగా పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన గణిత, విజ్ఞాన నమూనాలను ఆసక్తిగా తిలకించి, వారి ప్రతిభను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు స్వయంగా చేపడుతున్న సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ చర్యలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ప్రకృతిపై అవగాహన పెంపొందించడం అభినందనీయమన్నారు.

అలాగే పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న శుద్ధి చేసిన తాగునీరు, శౌచాలయాల నిర్వహణ, క్రీడా వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పీఎం శ్రీ పథకం ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను జాయింట్ సెక్రటరీకి వివరించారు.

ఈ పథకం లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆయన మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విజయలక్ష్మి బాయి, శ్రీనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments