వర్గీకరణ సాధన కోసం జరిగిన మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ పేర్కొన్నారు.
ఆదివారం నిజామాబాద్ నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శివ మాదిగ మాట్లాడుతూ.. అనేక ఉద్యమ ఘట్టాల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన బిడ్డల ఆశయాల సాధనకే ఎస్సీ వర్గీకరణ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
నాటి పోరుబాటలో చేసిన ప్రమాణాన్ని నేడు వర్గీకరణ సాధించడం ద్వారా నెరవేర్చుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణను అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్ నగరంలో మాదిగ అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం 2,000 గజాల స్థలాన్ని కేటాయించాలి.వర్గీకరణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నమోదైన పోలీసు కేసులను వెంటనే ఎత్తివేయాలి.
పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వారికి 250 గజాల నివేశన స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలోనే టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ నేతృత్వంలో ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లేష్ మాదిగ, కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, మాదిగ మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు బంటు జ్యోతి, మాదిగ ఉద్యోగస్తుల సంఘం నాయకులు మైసయ్య, రాములు, రమేష్, సీనియర్ నాయకులు తెడ్డు గంగారం తదితరులు పాల్గొన్నారు.
