మెండోరా: మండలంలోని పోచంపాడ్ చౌరస్తా వద్ద గల జాతీయ రహదారి 44 పై మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని మెండోరా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగాంపేట్ శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
సాగులో తలెత్తుతున్న ఇబ్బందులు..
యూరియా యాప్ వాడడం తెలియక ఆందోళనలో ఉన్న రైతులు అటు సాగుకు సైతం పూర్తిగా సమయం వెచ్చించలేకపోతున్నారని పేర్కొన్నారు. యాప్లో యూరియా బుక్ చేసిన అనంతరం రోజుల తరబడి సొసైటీలు, ప్యాక్స్ సెంటర్ల వద్ద వేచి ఉండాల్సి వస్తుందని..
దీంతో సాగు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చదువురాని, స్మార్ట్ ఫోన్లు లేని రైతులు అనేకమంది ఉన్నారని వారికి స్మార్ట్ ఫోన్లలో యూరియాను ఎలా బుక్ చేసుకోవాలో తెలియదన్నారు.
ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సబబు కాదని.. వెంటనే యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోని యూరియాను సరఫరా చేయాలని కోరారు.రాస్తారోకో నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ధర్నాలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,మండల రైతులు పాల్గొన్నారు.
