వినాయక నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిని గుర్తించి కమిషనరేట్ పరిధిలో 572 మందిని బైండోవర్ చేశారు. సంబంధిత తహసీల్దార్ల ఎదుట హాజరుపరిచి చట్టపరమైన నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారు.
నిజామాబాద్ డివిజన్‌లో 280 మంది, ఆర్మూర్ డివిజన్‌లో 175 మంది, బోధన్ డివిజన్‌లో 117 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే సమయంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.నిమజ్జనంలో పాల్గొనే ప్రజలు శాంతియుతంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
