రేవంత్ సర్కార్‌పై నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే నిప్పులుమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, ఆయనను టచ్ చేస్తే అగ్నిగుండం తప్పదని నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది మరియు కుటుంబ సభ్యులపై వస్తున్న బొగ్గు స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారని గణేష్ బిగాల ఆరోపించారు.
“సినిమా సీరియల్ తరహాలో విచారణల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఒకరోజు హరీష్ రావు, మరోరోజు కేటీఆర్, సంతోష్ రావు.. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ గారిని విచారణకు పిలవడం దుర్మార్గం” అని మండిపడ్డారు.
“గతంలో మీ గురువు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో ట్యాపింగ్ జరగలేదా? అని ప్రశ్నించారు. దేశ, రాష్ట్ర రక్షణ కోసం భద్రతా విభాగం చేసే పనులతో ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం లేదని గుండె మీద చేయి వేసి చెప్పగలరా? అని సవాల్ విసిరారు.పదేళ్ల పాటు రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అగౌరవంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయన ఇంటికి నోటీసులు అంటించడం కేవలం అప్రతిష్ట పాలు చేయడానికేనని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, ఇవి పార్టీని మరింత బలోపేతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, దండు శేఖర్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
