లోకసభ ఎన్నికలకు ముందు ఆదరాబాదరాగా ఇచ్చిన నామినేటెడ్ పదవుల ఫై నీలినీడలు అలుముకున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వ్యూలు జారీ చేయక పోవడంతో పదవులు పొందిన నేతల్లో అసహనం వ్యక్తం అవుతుంది. పదవులు వచ్చాయనే సంబరమే ఆ నేతల్లో లేకుండా పోయింది.
లోకసభ ఎన్నికల కోడ్ తొలిగిపోయాక ఉత్తర్వ్యూలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చినప్పటికి ఇంకా అధికారికంగా ఆదేశాలు రాకపోవడం అధికార పార్టీ లో చర్చనీయాంశం అయింది.
లోకసభ ఎన్నికల తర్వాత భారీఎత్తున బదిలీలు చేసింది అనేక పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కార్ తమ పదవుల విషయంలో ఎందుకు చూసి చూడనట్లుగా ఉంటుందో నేతలకు అంతు చిక్కడం లేదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు ముఖ్యనేతలకు రేవంత్ సర్కార్ నామినేటెడ్ ఛైర్మెన్ పదవులు కట్టబెట్టింది. అర్హులైన నేతలకే పదవులు దక్కాయి. ఇంకా అనేక మంది ఆశావహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.
కానీ మొదటి దఫాలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల కు సంబంధించే అధికార ఆదేశాలు ఇవ్వడంలో సర్కార్ జాప్యం చేస్తుంది. ఒక్కో నామినేటెడ్ పోస్టు కు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల నుంచి జీవో ఇవ్వాలి. ఇక్కడే సర్కార్ మెలిక పెట్టేసింది. దీనితో పదవులు పొందిన నేతలు బాధ్యతలు చేపట్టలేక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
నిజానికి పదవులు పొందిన నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్ ల నుంచి టికెట్ కోసం సర్వశక్తులు ఒడ్డిన సీనియర్ నేతలే ఎవ్వరూ కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు కాదు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే టికెట్ రాకపోయినా పార్టీ వీడకుండా గట్టిగా పనిచేసారు. బాన్స్ వాడ నుంచి టికెట్ ఆశించి బంగ పడిన బాలరాజు చివరికి ఆత్మ హత్య కు పాల్పడ్డాడు.
రేవంత్ భరోసా ఇవ్వడంతో పనిచేసారు. ఇచ్చిన హామీ మేరకు బాలరాజు కీలక పదవీ ఇచ్చారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్క బాల్కొండ సెగ్మెంట్ నుంచే ఏకంగా ముగ్గురు నేతలకు నామినేటెడ్ ఛైర్మెన్ పదవులు దక్కాయి.
మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇరవత్రి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ,కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి లకు సైతం ప్రాధాన్యత ఉన్న పదవులే కట్టబెట్టారు. ఈ ముగ్గురు టికెట్ కోసం చివరి దాక పట్టుబట్టినవారే కానీ అధిష్ఠానం హామీ తో వెనక్కి తగ్గారు.
అందుకు ప్రతిపలంగానే మొదటి దఫాలో నే అందలం దక్కింది. కానీ వారికి బాధ్యతలు అప్పగించే ఆదేశాలు మాత్రం ఇంకా సర్కార్ ఇవ్వడం లేదు. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో నామినేటెడ్ పదవుల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఒక్కో సెగ్మెంట్ లో కనీసం ఇద్దరు సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులు దక్కాలి. కానీ పదవులు తక్కువగా ఉండడంఆశావహులు ఎక్కువగా ఉండడం తో సర్దుబాటు చేయడం అదిష్టానం కు కత్తిమీద సాముగా మారింది.
అందుకే పదవుల పందేరం ఫై వివాదం తలెత్తింది.మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సిఫారస్ చేసిన వారికే పదవులు దక్కడం ఫై మిగితా దిగ్గజ నేతలు రగిలిపోయారు. లోకసభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో అధిష్టానం పదవుల పంపకాలఫై పునరాలోచనలో పడింది.
అందుకే అధికార ఆదేశాలు ఇవ్వకుండా రేవంత్ ను కట్టడి చేసిందనే వాదన తెరమీదికి వచ్చింది.పార్టీ ఎమ్మెల్యే లు లేని సెగ్మెంట్ ల నుంచి సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి.
