జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్ ; దుక్కులు దున్ని పంట భూములను సాగుకు సిద్ధం చేసుకున్న రైతులు వరుణ దేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినప్పటికీ నేటి వరకు భారీ వర్షాలు కురియకపోవడంతో రైతులు రుతుపవనాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ అడపాదడప చిరుజల్లులు తప్ప సాగుకు అనుకూలమైన వర్షాలు లేకపోవడంతో ఊరిస్తున్న రుతుపవనాల కోసం రైతులు ఆశతో నిరీక్షిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గలలో అధిక మొత్తం రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఖరీఫ్ పై గంపెడు ఆశలతో తమ వ్యవసాయ భూములను సాగుకు సిద్ధం చేసుకున్నారు.
ఉత్తర తెలంగాణ వరప్రధాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజ్ కి చేరడంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన మేర సాగునీటి అవసరాలను తీర్చే స్థాయిలో నీరు లేదు. అధిక మొత్తం రైతులు బోర్లు బావుల కింద వరి సాగును చేసుకుంటున్నారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ ద్వారా రైతులు వింటున్నప్పటికిని మేఘాలు మురిపించడంతో ఆశతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ నెల సగం పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు భారీ వర్షాలు కురవలేదు.
ఏడాది భారీ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండితే రైతులు పూర్తిస్థాయిలో వరి సాగు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కురిసిన కొద్దిపాటి వర్షపు చినుకులతో రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. కమ్ముకుంటున్న మేఘాలతో వరుణ దేవుడు ఎప్పుడు కటాక్షిస్తాడా..? అని ఎదురుచూస్తున్నారు..!
