జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని టీఎన్జీఓస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ పిలుపునిచ్చారు.
గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని టీఎన్జీఓస్ యూనియన్ భవన్లో శుక్రవారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు.
సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలను జీవితంలో ఆచరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలన్న గాంధీజీ సందేశం నేటికీ అవసరమన్నారు.
ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.లాల్‌బహదూర్ శాస్త్రి నిరాడంబర జీవనం, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని ముజీబ్ కొనియాడారు.
ఆయన ఇచ్చిన ‘జై జవాన్–జై కిసాన్’ నినాదం దేశ భద్రతలో సైనికులు, ఆహార భద్రతలో రైతుల పాత్రను చాటిచెప్పిందన్నారు. దేశాభివృద్ధిలో రైతులు, సైనికులు, ఉద్యోగులు, కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.గాంధీ, శాస్త్రి చూపిన విలువలను యువత ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశానికి అంకితభావంతో సేవ చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీఎన్జీఓస్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు కొండల్‌రెడ్డి, కార్యదర్శి శైలజ, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అసద్ఉద్దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఖలీద్, బొలిగిద్ద శంకర్, ఐటీఐ ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఈసీ సభ్యుడు ముఖీద్ ఖురేషీ, ఏపీఆర్వో వహీద్, ఐటీఐ యూనిట్ అధ్యక్షుడు సత్యనారాయణ, వివిధ శాఖల ఉద్యోగులు కృష్ణ, రోహిత్, మధు, ఉస్మాన్భాయ్, రామకృష్ణ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
