రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు సూచించారు. నగరంలోని నారాయణగూడ కేశవ మెమోరియల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో అధికారులు విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు.
సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఇమ్మాన్యుయేల్, గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ షకీర్ అలీ, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సిద్ధార్థ్ నాయక్ రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాలను వివరించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి అలవాట్లు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు.
రోడ్డు భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను తెలియజేయాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
