HomeCRIMEయువత మత్తుకు బానిస కావొద్దు- 2కె రన్‌లో నినదించిన నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయిచైతన్య..

యువత మత్తుకు బానిస కావొద్దు- 2కె రన్‌లో నినదించిన నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయిచైతన్య..

డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, యువతను మత్తు పదార్థాల బారి నుంచి కాపాడటం మనందరి బాధ్యత అని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్‌ శాఖ, నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, ఐఎంఏ ఆధ్వర్యంలో ‘2కె రన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ సమస్య కొత్తదేమీ కాదని, దేశాన్ని బలహీనపరిచేందుకు శత్రు దేశాలు యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలను వ్యాప్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ బలం యువతేనని, వారిని పెడదోవ పట్టించే కుట్రలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. డ్రగ్స్‌ నియంత్రణ కోసం ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయని, ఆ నిధులు అభివృద్ధికి తోడ్పడాలంటే సమాజం మత్తు రహితంగా మారాలని స్పష్టం చేశారు. రానున్న రెండు, మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

డ్రగ్స్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1908కు ఫోన్‌ చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. పోలీస్‌ కమిషనర్‌ జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీ, జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి బయలుదేరి రైల్వే కమాన్‌, పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా మీదుగా పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌ వరకు సాగింది.

సుమారు 3,000 మంది విద్యార్థులు, ప్రజలు ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కవితారెడ్డి, సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్‌ రహిత సమాజ ప్రతిజ్ఞ చేయించారు.

పోలీస్‌ కళాబృందం ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) ఎన్.శుభం ప్రకాష్‌, జిల్లా ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారి ఐశ్వర్య, ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ విశాల్‌, సెక్యూరిటీ కౌన్సిల్‌ సభ్యులు దర్శన్‌సింగ్‌, శిరీష్‌ కుమార్‌, హితేన్‌ బిమాని, రజనీకాంత్‌, శ్రీనివాస్‌ రెడ్డి, డీవైఎస్‌వో పవన్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments