నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఆసుపత్రి వర్గాలు, గుండె చికిత్స విభాగంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా పీటీసీఏ ప్రక్రియను చేపట్టి, స్టెంట్ అమర్చడం ద్వారా రోగికి పునర్జన్మ ప్రసాదించారు. 65 ఏళ్ల బురాజీ అనే వ్యక్తి గత మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్రమైన ఛాతినొప్పితో జీజీహెచ్‌కు తరలివచ్చారు.
పరీక్షించిన వైద్యులు ఆయనకు ‘అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్’ (తీవ్ర గుండెపోటు) వచ్చినట్లు గుర్తించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, కార్డియాలజీ బృందం అప్రమత్తమై వెంటనే థ్రాంబోలైసిస్ ప్రక్రియ ద్వారా రోగిని ప్రాథమికంగా స్థిరీకరించారు.
అనంతరం గురువారం నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ‘రైట్ కరోనరీ ఆర్టరీ’ లో తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు. సమయం వృథా చేయకుండా కార్డియాలజీ విభాగ వైద్యులు డా. సందీప్, డా. గోపీకృష్ణ, డా. రవికిరణ్ల బృందం పీటీసీఏ మరియు స్టెంట్ అమరిక ప్రక్రియను అత్యంత నైపుణ్యంతో పూర్తి చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఈ విజయవంతమైన చికిత్సపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. బి.వి. నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రాములు హర్షం వ్యక్తం చేశారు. కార్డియాలజీ వైద్య బృందాన్ని, క్యాథ్ ల్యాబ్ సిబ్బందిని, నర్సింగ్ మరియు ఇతర సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి అత్యవసర గుండె చికిత్సలు, స్టెంట్ ప్రక్రియలు అందుబాటులోకి రావడం స్థానిక ప్రజలకు ఎంతో ఊరట అని వారు పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జీజీహెచ్ నిరంతరం కృషి చేస్తోందని వారు స్పష్టం చేశారు.
