మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 138 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా న్యాయమూర్తులు వారికి భారీగా జరిమానాతో పాటు జైలు శిక్షలు ఖరారు చేశారు.
కోర్టుకు హాజరైన వారిలో తొమ్మిది మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.11,10,000/- (పదకొండు లక్షల పది వేల రూపాయలు) జరిమానా విధించినట్లు సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో చాలా మంది అధిక మొత్తంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదాల నివారణకే నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలపై వాహనదారులను హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తామని, ఒకసారి కంటే ఎక్కువసార్లు పట్టుబడితే కోర్టు ద్వారా ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే సదరు వాహనానికి లేదా వ్యక్తికి ఎలాంటి ఇన్సూరెన్స్ (భీమా) లభించదన్నారు. ముఖ్యంగా మైనర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే..
సదరు మైనర్లతో పాటు వాహన యజమానులపైనా ఛార్జ్‌షీట్ నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ 1989 (2019 సవరణ చట్టం) ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉందన్నారు.
రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు రద్దీ రోడ్లపై వెళ్లే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని సీపీ సాయి చైతన్య ప్రజలను కోరారు.
