చాదర్‌ఘాట్ ప్రాంతంలో రాత్రి వేళ ముఖాలు కప్పుకుని అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు చిక్కిన ఇద్దరు వ్యక్తులకు నాంపల్లిలోని 6వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ కె.బి. మురారి కథనం ప్రకారం.. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ముఖాలు కప్పుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నేరానికి పాల్పడే ఉద్దేశంతో సంచరిస్తున్నారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 61(బి) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ కేసును విచారించిన నాంపల్లిలోని 6వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎం. భాస్కర్ ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో బడాల లింగప్ప (30), మలక్‌పేటకు చెందిన వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు.
మరో నిందితుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కేసును చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం. సురేశ్‌రెడ్డి దర్యాప్తు చేయగా, పీసీ జి. సాయినాథ్ కోర్టు విధులను నిర్వహించారు.
