ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్త నిరవధిక ఆటో బంద్ చేపడుతామని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ హెచ్చరించింది.
దీర్ఘకాలికంగా పెండింగ్ లోఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ హైదరాబాద్, హిమాయత్ నగర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుండి నారాయణగూడ చౌరస్తా వరకు శనివారం వందలాదిమంది ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించింది.
అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు బి. వెంకటేశం (ఏఐటీయూసీ), ఏ. సత్తిరెడ్డి (టిఏడిఎస్) పి. శ్రీకాంత్ (సి.ఐ.టి.యు) ఎంఏ. సలీం, ఎండి. నజీర్ (యు.టి.ఏ.డబ్ల్యూ.ఏ), వి. మారయ్య, నిరంజన్ (బి.ఆర్.టి.యు), వి. ప్రవీణ్ (టియుసిఐ), రామ్ రెడ్డి (ఐ.ఎఫ్.టి.యు) సిహెచ్. జంగయ్య, ఎస్. అశోక్, ఎండి. ఒమర్ ఖాన్, ఏం. శ్రీనివాస్, ఏం. కృష్ణ (ఏఐటీయూసీ) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్ట్ల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి నేడు పరిష్కరించకుండా కాలయాపన చేయడం సిగ్గు చేటన్నారు.
సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం, ఇంధన చార్జీల పెంపునకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచడం, రవాణారంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, కొత్త ఆటో పర్మిట్ల మంజూరు, రాష్ట్ర ప్రభుత్వమే రవాణా అప్ ఏర్పాటు, స్కూల్ వ్యాన్లు, ఓలా, రాపిడో, ఉబెర్ ద్విచక్ర వాహనాలు, ఇతర జిల్లాల ఆటో లను నిషేధించడం వంటి న్యాయమైన డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక ఆటో బంద్ చేపడుతామని బి. వెంకటేశం హెచ్చరించారు.
