నందిపేట మండలం కొండూరు గ్రామ శివారు హరితహారం నర్సరీ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రోడ్డుకు అడ్డు వచ్చిన గేదెను తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన ఉన్న లోయలో పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు తలకు గాయాలై మృతి చెందాడు.
నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన సందుల చిన్నోళ్ల సాయిలు, వయసు: 51, కులం: కుర్మా, తన సొంత ట్రాక్టర్ను తీసుకొని లోకేశ్వరం లోని పంచగుడి దగ్గర తను కౌలుకు చేస్తున్న పొలం కోసేందుకు వెళ్తూ మార్గమధ్యంలో కొండూరు గ్రామ శివారు ప్రాంతంలో గల నర్సరీ వద్ద అడ్డు వచ్చిన గేదెను తప్పించబోయి ట్రాక్టర్ను ఎడమవైపు తిప్పడంతో రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాయిలు ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని, మృతుని భార్య సందుల విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
