- ఒకే గ్రామానికి చెందిన సాబీర్ కిషన్ లు గుండెపోటుతో మృతి
- సౌదీలో నెల రోజుల వ్యవధిలో జరిగిన దారుణం
- ఒకరు కంటి చూపుకు నోచుకోలేదు
- మరొకరి మృతదేహం స్వగ్రామానికి చేరిక
- ఇరు కుటుంబాల్లో నిండిన గల్ఫ్ విషాదం
ఉపాధి కోసం దేశం దాటారు.. కొన్నాళ్లు కష్టపడితే గట్టెక్కవచ్చు అని భావించారు. కానీ ఇంతలోని విధి వక్రీకరించింది. కన్న వారిని .. ఉన్న ఊరును విడిచి ఎడారి దేశంలోనికి వలస వెళ్లిన వారు, తిరిగిరాని లోకానికి తరలి వెళ్లారు. వారిద్దరిది ఒకే గ్రామం . వెళ్ళింది ఒకే దేశం.
ఒకే నెలలో ఇరువురు గుండెపోటుతో మరణించారు. ఒకరి మృతదేహం కంటిచూపుకు నోచుకోకపోతే, మరొకరి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన సాబేర్ ఆలీ, గోజ కిషన్ అనే ఇరువురు గత 30 సంవత్సరాలుగా పొట్ట చేత పట్టుకుని సౌదీ దేశంలో వలస జీవులుగా ఉన్నారు. సాబీర్ అలీ సౌదీలో డ్రైవర్ గా పనిచేస్తుండగా…
కిషన్ మెకానిక్ గా విధులు నిర్వహించాడు. అంతలోనే వీధి వక్రీకరించడంతో ఇరువురు ఒకే నెల వ్యవధిలో గుండెపోటుతో ఎడారి దేశంలో తనువుచాలించారు.
సాబీర్ అలీ మే 28వ తేదీన పనులు ముగించుకొని నిద్రలో ఉండగా కార్డియాక్ అరెస్టుతో చనిపోయాడు. దీంతో చేసేదేమి లేక సౌదీ దేశంలోనే అతని అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆయన అంత్యక్రియలో పాల్గొన్న స్నేహితుడు గోజ కిషన్ జూన్ 24వ తేదీన విధులు ముగించుకొని నిద్రలో ఉండగా గుండెపోటుతో మరణించాడు.
అదే దేశంలో ఉంటున్న అతని సోదరుడు, కుమారుడు ఇరువురు కలిసి కిషన్ మృతదేహాన్ని తన స్వగ్రామమైన పచ్చల నడ్కుడకు తీసుకువచ్చారు.
ఈనెల రెండవ తేదీన ఇండియాకు రావడానికి విమాన టికెట్ సైతం కిషన్ బుక్ చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు సజీవంగా రావలసిన ఆయన మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇలా ఒకే గ్రామానికి చెందిన ఇరువురు ఒకరు కంటి చూపుకు నోచుకోకపోతే మరొకరు కడతేరారు. ఇలా గల్ఫ్ వలస బాట పట్టిన బాధితుల గాధలు చెరగని విషాదాన్ని ఇరు కుటుంబాల్లో నింపాయి.
