HomePOLITICAL NEWSArmoorఅడ్డుకోకపోతే... అక్రమనే..?-ఆర్మూర్ లో చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు - విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు

అడ్డుకోకపోతే… అక్రమనే..?-ఆర్మూర్ లో చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు – విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు

అనుమతులు లేకుండానే ప్రారంభించిన కట్టడాలు – వసూల్ ‘రాజా’ కి భారీగా ముడుపులు..?- మున్సిపల్ అధికారుల అనుమతులపై అనుమానాలు- ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు – సామాన్యుడికి ఒకటి..

సామంతుడికి మరొకటా..?- నిర్మాణాలు అక్రమమా.. సక్రమమా..?- ఆమ్యామ్యాలపై ఉన్న శ్రద్ధ అక్రమ నిర్మాణాలపై లేదా..?జాన రమేష్ : ఇది సంగతి; ఆర్మూర్;

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టిన అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

కొన్ని నిర్మాణాల అనుమతులపైఆర్మూర్ మున్సిపల్ అధికారుల తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆక్రమణలు జరగకుండా అడ్డుకోవలసిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని పట్టణ వాసులు అంటున్నారు.

దీంతో అక్రమార్కులకు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది పరిస్థితి. పట్టణ అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన అధికారులకు ఆమ్యామ్యాలపై ఉన్న శ్రద్ధ …

అభివృద్ధిపై లోపించిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న మున్సిపల్ అధికారుల తీరు వివాదాస్పదమవుతుంది.

సదరు నిర్మాణాలకు సంబంధించి ‘వసూల్ రాజా’కు భారీగా ముడుపులు అందినట్టు పట్టణవాసులు గుసగుసలాడుకుంటున్నారు.

పేద, మధ్యతరగతికి చెందిన ఓ సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే సవాలక్ష కొర్రీలు పెట్టి, తమ అధికారులను అక్కడికి పంపించి, ఏదో ఒక పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకుందాం అంటే జంకే పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో గల 199, 200 సర్వే నెంబర్లలో ఇటీవల ఓ రియల్టర్ సామూహిక భవన నిర్మాణాలు ప్రారంభించారు. కోటార్మూరు శివారులోని పాత నిమ్మల గార్డెన్ సమీపంలో 202 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉంది.

ప్రస్తుతం ఆనవాళ్లు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. సదరు రియల్టర్ నిర్మిస్తున్న సామూహిక భవన నిర్మాణాలు 202 సర్వేనెంబర్ లో కొనసాగుతున్నాయని ఇటీవల రెవెన్యూ అధికారులు భూ సర్వే చేపట్టారు. అనంతరం కొంత భాగం అక్రమంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు తేల్చారు.

ఇంతవరకు బాగానే ఉన్న, ఇంటి నిర్మాణాల కోసం అనుమతి పొందిన తర్వాతే ప్రారంభించాలి. ఒకవేళ అనుమతి లేకుండా నిర్మాణాలు ప్రారంభిస్తే, వాటిని ఆపాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది. 202 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..!

ఈమధ్య పెర్కిట్ శివారులోని డిస్ట్రిబ్యూటర్ కెనాల్ 82/2/1 లో రియల్టర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని అధికారుల సర్వేలో తేలడంతో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కబ్జాకు గురైన ఇరిగేషన్ కెనాల్ ను స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశారు.

కానీ పట్టణం నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతుంటే రెవెన్యూ , మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర విడకపోవడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

202 శివారులోని సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తూ.. గతంలో తాహసిల్దార్ ప్రభుత్వ భూమిగా సూచిస్తూ పెట్టిన బోర్డును సైతం రియల్టర్లు తొలగించడం పై ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉంది.

ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను కాపాడుతామని ప్రగల్బాలు పలుకుతున్న ప్రజాప్రతినిధులు పట్టణ నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆక్రమణకు గురవుతుంటే పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏది ఏమైనా రక్షించాల్సిన అధికారులే.. ప్రభుత్వ భూముల అన్యక్రాంతానికి తోడ్పాటు అందిస్తున్నారనేది బహిరంగ రహస్యంగా కనబడుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సర్వే చేయించి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments