ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పరిపాలన పడకేయడమే కాకుండా..
ప్రజల ప్రాణాలకు భద్రతను కూడా ఇవ్వడం లేదని పలువురు అంటున్నారు. ఓ పక్క పారిశుధ్యం పై చిత్తశుద్ధి లోపించి పలు గ్రామాల్లో దోమలు స్వైర విహారం చేస్తుంటే, మరో పక్క పిచ్చి కుక్కలు నడివీధులలో విరుచుకుపడుతున్నాయి.
ఇటీవల కాలంలో ఆర్మూర్ డివిజన్ లో వీధి కుక్కలు ప్రజల పాలిట యమ సింహాలు గా మారాయి. జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేసింది.
గత మూడు రోజులుగా కుక్క కాటుకు సుమారు 45 మంది వరకు గాయపడగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో వృద్ధులతో పాటు స్కూల్ చిన్నారులు కూడా ఉన్నారు.
దీంతో జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామంలో శనివారం రాత్రి సుమారు పదిమందికి పైగా గ్రామస్తులను కరవడంతో గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
గాయపడిన క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
