విద్యా శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఎరా చూపి ఓ ముఠా నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్నారు. మూడు సంవత్సరాలుగా విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట భారీ మోసాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.దాంట్లో నిర్మలతో పాటు హైదరాబాద్కు చెందిన కొంతమంది నేతలు, వారి అనుచరులు కలిసి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.
ఉద్యోగాల పేరుతో యువత దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసి, కొందరికి తాత్కాలిక ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ, వారికీ నెలల తరబడి వేతనాలు అందకపోవడం కంగుతిన్నారు.దీంతో వేతనాలు రాకపోయినా భవిష్యత్తులో స్థిర ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితులు ఇప్పటికీ పనులు కొనసాగిస్తున్నారు.
ఇక ఇటీవల కుటుంబ సభ్యుల ఒత్తిడిని తట్టుకోలేక, వాస్తవాలు తెలుసుకోవడానికి బాధిత యువకులు ఉద్యోగాలు ఇప్పించిన వారిని నిలదీయగా, వారు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు పలుమార్లు నమోదైనప్పటికీ, కొందరు రాజకీయ నాయకుల జోక్యంతో ఆ కేసులు అటకెక్కించారు. ఈ ఘటనతో విద్యాశాఖలోని అవకతవకలు మరోసారి వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. బాధిత యువత న్యాయం కోసం ఈసారి కేసును చివరిదాకా పోరాడతామని సంకల్పించారు.
