జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతంధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి.. నీట్ పరీక్షలను రాష్ట్రాలకు అప్పగించాలి: వామపక్ష విద్యార్థి సంఘాలునీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి.
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు జిల్లాలోని పలు ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్యా, హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలు మద్దతు తెలిపినట్లు సంఘాల నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీట్ పరీక్షల నిర్వహణలో వరుస వివాదాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం అమానుషమని మండిపడ్డారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్‌కు సంబంధించిన సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబ సభ్యులను ప్రభుత్వం పరామర్శించాలని కోరారు.
భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన సంస్కరణలు చేపట్టాలని, నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సూచించారు. పార్లమెంట్‌లో నీట్ విద్యార్థుల సమస్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించాలని డిమాండ్ చేసిన నాయకులు, విద్యార్థులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ఖండించారు.
విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
