నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది.నిత్యం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న అధికారులు మారడం లేదు.
మున్సిపల్ కార్యాలయంలో ఫైలు ముందుకు జరగాలంటే చెయ్యి తడిపాల్సిందే. తాజాగా ఆర్మూర్ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏ. రాజు, లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికారు.
ఈ అవినీతి వ్యవహారంలో కమిషనర్‌కు సహకరించిన డ్రైవర్ భూమేశ్ కూడా ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఆర్మూర్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించడానికి మున్సిపల్ కమిషనర్ రాజు రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు గురువారం మున్సిపల్ డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అనంతరం డ్రైవర్ బ్యాగ్ను చెక్ చేయగా.. లెక్కల్లో చూపని రూ.4.30 లక్షల నగదు గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకొని కమిషనర్తో పాటు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.
లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు.
1064 టోల్ ఫ్రీ నెంబర్, లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
