మూడో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ అనుచరులు,మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
దీంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మూడో విడతలో మొత్తం 165 గ్రామ సర్పంచ్ స్థానాలకు గాను 1077 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు పోటీ తీవ్రతను ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.
అదే విధంగా, 1620 వార్డు స్థానాలకు మొత్తం 4021 నామినేషన్లు దాఖలయ్యాయి.ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 3,26,029 మంది ఓటర్లు ఉండగా 1,50,120 పురుషులు, 1,75,903 మహిళలు, ఆరుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.57 కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ స్థానానికి 606, వార్డులకు 2,367 నామినేషన్లు వచ్చాయి.
నేడు నామినేషన్ల పరిశీలన: మూడో విడతకు దాఖలైన నామినేషన్లను శనివారం పరిశీలిస్తారు. 7న వినతులను స్వీకరించి..వాటిని 8న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 9వ తేదీ. బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు.
మరోవైపు రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నేడు నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. అలాగే అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు.
