వార్షిక నేర నివేదిక-2025ను విడుదల చేసిన సీపీ సాయిచైతన్య
జిల్లాలో 4 శాతం తగ్గిన మొత్తం కేసులు..
భారీగా పెరిగిన ఆస్తుల రికవరీ, సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ‘వార్షిక నేర గణాంక నివేదిక-2025’ను విడుదల చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో 8,983 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 8,624కు తగ్గింది. అంటే మొత్తం నేరాలలో 4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని విభాగాల్లో కేసుల సంఖ్య పెరగడం గమనార్హం:
- హత్యలు: గత ఏడాది 43 ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 50కి చేరింది.
- హత్యా యత్నాలు: 62 నుంచి 101కి పెరిగాయి.
- కిడ్నాప్ కేసులు: గత ఏడాది 126 నమోదు కాగా, ఈ ఏడాది 165 కేసులు నమోదయ్యాయి.
- పోక్సో కేసులు: చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి గత ఏడాది 120 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 168 కేసులు నమోదయ్యాయి.
- దోపిడీ హత్యలు: గత ఏడాది 7 ఉండగా, ఈ ఏడాది 11కు పెరిగాయి.
- ఎస్సీ, ఎస్టీ కేసులు: ఇవి గత ఏడాది 107 ఉండగా, ఈ ఏడాది 83కి తగ్గి కొంత ఊరటనిచ్చాయి.
రూ. 10 కోట్లకు పైగా ఆస్తుల రికవరీ
పోలీసుల చొరవతో ఈ ఏడాది రికవరీల శాతం గణనీయంగా పెరిగింది. గతేడాది కేవలం రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 10,35,58,845 విలువైన ఆస్తులను రికవరీ చేశారు. అలాగే పోగొట్టుకున్న 1,485 సెల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు.
సైబర్ నేరాల సెగ: 7 శాతం పెరుగుదల
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా సవాలుగా మారుతున్నాయి.- ఈ ఏడాది జిల్లాలో 2,532 సైబర్ కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు దాదాపు రూ. 15.29 కోట్లు కొల్లగొట్టగా, పోలీసుల కృషితో అందులో రూ. 3.89 కోట్లు రిఫండ్ చేయగలిగారు. ప్రజల్లో అవగాహన కోసం 1,164 కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మృతుల సంఖ్య
ట్రాఫిక్ నిబంధనల కఠినతరం, అవగాహన సదస్సుల వల్ల రోడ్డు ప్రమాదాల తీవ్రత తగ్గింది. - గత ఏడాది 857 ప్రమాదాల్లో 353 మంది మరణించగా.. ఈ ఏడాది 780 ప్రమాదాల్లో మృతుల సంఖ్య 276కి తగ్గింది.
- డ్రంక్ అండ్ డ్రైవ్: తనిఖీలను ముమ్మరం చేయడంతో గతేడాది (8,410) కంటే ఈ ఏడాది అత్యధికంగా 17,627 కేసులు నమోదయ్యాయి.
- ఖలీల్ వాడి ప్రాంతంలో వన్ వే విధానం అమలు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని సీపీ వివరించారు.
సామాజిక బాధ్యత – కౌన్సెలింగ్
కుటుంబ కలహాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మహిళా పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ పెంచారు. గత ఏడాది 464 మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా, ఈ ఏడాది 533 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. డయల్ 100కు ఈ ఏడాది 62,629 కాల్స్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
నేరాలు లేని సమాజమే లక్ష్యం:
“జిల్లాలో ఒక్క కమ్యూనల్ మర్డర్ కేసు కూడా నమోదు కాకపోవడం గర్వకారణం. సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సైబర్ అవగాహన ద్వారా నేరాలను మరింత అదుపు చేస్తాం.”డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చి దిద్దటమే లక్యమని అన్నారు.- జిల్లాలో అంతరాష్ట్ర ముఠా ఎక్కువ కావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు.అలాగే సరిహద్దు చెక్ పోస్ట్ లు ఏర్పాట్లు పెంచమని 600 మంది దొంగలపై నిఘా పెంచమని అన్నారు.
– సాయిచైతన్య, పోలీస్ కమిషనర్.
