నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. నగర ఓటర్ల ముసాయిదా జాబితాలోని అక్రమాలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్తా.. పేరు వివాదంతో ‘రాజకీయ రణరంగం’గా మారింది.
బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య వాగ్వాదంతో మున్సిపల్ కమిషనర్ చాంబర్ వద్ద ఒక్కసారిగా సెగలు పుట్టాయి.నిజామాబాద్ అర్బన్ పరిధిలో ఓట్ల ముసాయిదాలో అనేక తప్పులు ఉన్నాయని, ఒక వార్డు ఓట్లు మరో వార్డులోకి మళ్లించారని వచ్చిన ఆరోపణలకు కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ చర్చా సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ.. నిజామాబాద్ పేరును ‘ఇందూరు’ అని ప్రస్తావించారు. దీనిపై ఎంఐఎం నేతలు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో నిజామాబాద్ అని ఉండగా, ఇందూరు అని ఎలా పిలుస్తారని ప్రశ్నించడంతో వివాదం ముదిరింది.
ఎంఐఎం నేతల అభ్యంతరంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఇందూరు’ అన్నది చారిత్రక పేరు అని, దానిని పిలిచే హక్కు తమకు ఉందని నినదించారు.
దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి చేజారిపోయేలా ఉండటంతో కమిషనర్ దిలీప్ కుమార్ వెంటనే జోక్యం చేసుకున్నారు. నాయకులందరితో వ్యక్తిగతంగా మాట్లాడి, శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది.
నగరంలో ఓట్ల గందరగోళంపై అన్ని పార్టీల నేతలు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు కావడంపై విచారణ జరిపి, తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకమైన జాబితాను విడుదల చేయాలని కోరారు.
