భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని వివేకానంద సేవా సమితి నాయకులు కొనియాడారు.
మంగళవారం మండల కేంద్రంలోని వివేకానంద ఏకశిలా విగ్రహం వద్ద సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో వివేకానందుడు ఒక ధ్రువతార అని, ఆయన మన దేశంలో జన్మించడం భారతీయులందరి అదృష్టమని పేర్కొన్నారు. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతీయ ధర్మనిబద్ధతను, ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశారని గుర్తు చేశారు.
ప్రపంచ యువతకు ఆయన నిరంతర స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. లోకంలోని ఆడంబరాలన్నీ క్షణభంగురాలే. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వారు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతారు, మిగిలిన వారు జీవచ్ఛవాలతో సమానం” అన్న వివేకానందుడి మాటలు మానవ జీవిత విలువను చాటిచెబుతున్నాయని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో సేవా సమితి మండల నాయకులు మచ్చర్ల సాగర్, దమ్మాయి సుధాకర్, కానుగుల సాగర్, మంతెన శ్రీను, భోజేందర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
