సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం నిషేధించిన ప్రమాదకరమైన ‘చైనా మాంజా’ను విక్రయిస్తున్న వ్యక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చేపట్టిన తనిఖీల్లో భారీగా చైనా మాంజా పట్టుబడింది.
రెండవ టౌన్ ఎస్హెచ్ఓ తెలిపిన వివరాల ప్రకారం.. చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నగరంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు.
ఈ క్రమంలో పోస్టాఫీసు వెనుక భాగంలో ఉన్న ‘సుల్తాన్ కైట్ షాపు’ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తున్న సయ్యద్ అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అతడు తన బైక్ పై తరలిస్తున్న 18 చైనా మాంజా చుట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మాంజాను విక్రయిస్తున్న సయ్యద్ అస్లాంతో పాటు, ఈ వ్యాపారానికి సూత్రధారి అయిన షాపు యజమాని ఫహీమ్ అన్సారీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం నిందితుడు అస్లాంను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న యజమాని ఫహీమ్ అన్సారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో హెచ్సీ రాములు, కానిస్టేబుళ్లు సాయికిరణ్, నవీన్, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
