Saturday, April 18, 2026
HomeCRIMEగంజాయి ముఠా ఘాతుకం: ఎక్సైజ్ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు! 2 కిలోల గంజాయి పట్టివేత..

గంజాయి ముఠా ఘాతుకం: ఎక్సైజ్ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు! 2 కిలోల గంజాయి పట్టివేత..

జిల్లా కేంద్రంలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని తప్పించుకునే క్రమంలో మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ప్రాణాపాయం తలపెట్టారు.

ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోకి ఎండు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ తన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం మాధవనగర్ వద్ద రూట్ వాచ్ (తనిఖీలు) చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును ఆపేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య ప్రయత్నించారు.

తనిఖీల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారు డ్రైవర్ వేగంగా వాహనాన్ని ఆమెపైకి పోనిచ్చాడు. కారు బలంగా ఢీకొట్టడంతో సౌమ్య రోడ్డుపై పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ప్రుడెన్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు పొట్ట భాగంలో అంతర్గత గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎక్సైజ్ బలగాలు నిందితులను వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 2 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని సౌమ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!