Sunday, April 26, 2026
HomeTelanganaNizamabadపన్ను ఎగవేతదారులకు మేయర్ పీఠమా.?17 ఏళ్ల నుంచి కట్టని బకాయి ఇప్పుడు ఎక్కడ నుంచి కట్టాడు..హిందుత్వం...

పన్ను ఎగవేతదారులకు మేయర్ పీఠమా.?17 ఏళ్ల నుంచి కట్టని బకాయి ఇప్పుడు ఎక్కడ నుంచి కట్టాడు..హిందుత్వం మా డీఎన్‌ఏ.. కాంగ్రెస్‌ది కమిషన్ల రాజకీయంఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజం

ఏళ్లుగా మున్సిపల్ పన్నులు చెల్లించకుండా ప్రజలను, అధికారులను మోసం చేసిన వ్యక్తికి మేయర్ అయ్యే అర్హత ఎక్కడిదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి (వంశీ హోటల్ యజమాని) పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత 17 ఏళ్లుగా మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ పన్ను బకాయిలు చెల్లించని నరేందర్ రెడ్డి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రూ. 8.16 కోట్ల బకాయిలను చెల్లించారని అరవింద్ పేర్కొన్నారు.

“ఇన్నాళ్లూ లేని డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా లాటరీ తగిలిందా లేక లంకె బిందెలు దొరికాయా?” అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ భారీ మొత్తాన్ని కట్టించిన ఘనత బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు.

నైతికత లేని అభ్యర్థికి ఓటు వేయొద్దుడబ్బులు లేక కాదు, కేవలం కట్టాలనే చిత్తశుద్ధి లేకే ఇన్నాళ్లూ పన్నులు ఎగ్గొట్టారని ఆరోపించారు. పన్నులు కట్టకుండా ఇందూరు ప్రజలను మోసం చేసిన ఇలాంటి వ్యక్తులు మేయర్ పీఠంపై కూర్చుంటే, రేపు మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లను వ్యాపారమయం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్ పదవి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, గెలిచిన తర్వాత అంతకంటే ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇలాంటి వారి నుంచి ఇందూరు ప్రజలను ఆ శ్రీరాముడే కాపాడాలన్నారు.కాంగ్రెస్ పార్టీలోని ఇతర 59 డివిజన్ల అభ్యర్థుల సంగతి పక్కన పెడితే, 19వ డివిజన్ ప్రజలు మాత్రం నరేందర్ రెడ్డికి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలని విమర్శించారు. నైతిక విలువలు లేని అభ్యర్థులను బ్యాలెట్ ద్వారా శిక్షించాలని ఆయన కోరారు.

హిందుత్వం మా డీఎన్‌ఏ.. కాంగ్రెస్‌ది కమిషన్ల రాజకీయం

హిందుత్వం అనేది కేవలం ఎన్నికల నినాదం కాదు.. అది మా డీఎన్‌ఏలోనే ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎన్నికలు రాగానే బీజేపీకి హిందుత్వం గుర్తుకు వస్తుందన్న కాంగ్రెస్ అభ్యర్థుల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసమే రాజకీయాలు చేస్తుందని, దానికి సిద్ధాంతాల పట్ల చిత్తశుద్ధి లేదని అరవింద్ ఆరోపించారు.

బీజేపీ ఎన్నడూ హిందుత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోలేదని, అది తమ జీవన విధానమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీది హిందూ వ్యతిరేక విధానమని, అందుకే తాను ఆ పార్టీలో చేరలేదని వెల్లడించారు.

అభివృద్ధికి పెద్దపీట

పార్టీ పట్ల అంకితభావం ఉన్న నేతలకు మాత్రమే టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఈసారి టికెట్లు నిరాకరించామని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన 11 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించామని వెల్లడించారు.

“కేవలం పార్టీ మారినంత మాత్రాన టికెట్లు దక్కవు. తమ తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించిన వారిని మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేశాం” అని ఆయన వివరించారు.

బీజేపీ తిరస్కరించిన నేతలను కాంగ్రెస్‌ పార్టీ అక్కున చేర్చుకుని టికెట్లు కట్టబెట్టడం హాస్యాస్పదం అన్నారు. బీజేపీ గెలిస్తే వచ్చే ప్రతి రూపాయి ప్రజల శ్రేయస్సు కోసమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు శాశ్వత పరిష్కారాలు చూపుతాం.

అన్ని వీధుల్లో స్ట్రీట్ లైటింగ్, రోడ్ల మరమ్మత్తులు చేపడతామను హామీ చేశారు. కుటుంబ సంబంధాలు వేరు.. రాజకీయం వేరు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే సోనియా గాంధీ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని అరవింద్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

“వ్యక్తిగతంగా సోనియా గాంధీ గారితో మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాల వల్లే నేను ఆ పార్టీకి దూరంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.

పార్టీలో ఒక సీనియర్ నాయకుడిని అవమానించి, దాడులు చేసి బయటకు పంపిన తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హైకమాండ్ అమ్ముడుపోతుందనడానికి తన వద్ద ఉన్న ఆధారాలను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!