పంటలు పొట్టదశకు చేరుకున్న వేళ.. చేనుకు బలాన్నిచ్చే యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్టిలైజర్ యాప్ ఇబ్బందులు, ఓటీపీల వేధింపులతో విసిగిపోయిన నిజామాబాద్ నగర శివారు బోర్గాం (పి) గ్రామ రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియా దొరకడం లేదంటూ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం తెచ్చిన యాప్ విధానం తమకు శాపంగా మారిందని రైతులు వాపోయారు.అలాగే కౌలుకు సాగు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎరువుల కోసం దరఖాస్తు చేస్తే ఓటీపీ భూమి యజమాని ఫోన్‌కు వెళ్తోంది. వారు నగరాల్లోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉండటంతో సమయానికి ఓటీపీ లభించడం లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు.
అసలు ఓటీపీ అంటే ఏమిటో, యాప్ ఎలా వాడాలో తెలియక సామాన్య రైతులు డీలర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇప్పటికే యూరియా వేయాల్సిన సమయం మించిపోయిందని, తక్షణమే ఎరువులు అందకపోతే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల నిరసనతో విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. యాప్ వల్ల తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం. రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే యూరియా నిల్వలను గ్రామానికి పంపిస్తాం” అని ఏడీ హామీ ఇచ్చారు.
అధికారి నుంచి సానుకూల స్పందన రావడంతో రైతులు శాంతించి నిరసన విరమించారు. త్వరితగతిన యూరియా పంపిణీ చేసి తమ పంటలను కాపాడాలని ఈ సందర్భంగా వారు కోరారు.
