HomeCRIMEవైద్యుల నిర్లక్ష్యం తో వ్యక్తి మృతి..వెల్‌నెస్ ఆసుపత్రిలో 'కాసుల' కక్కుర్తి!

వైద్యుల నిర్లక్ష్యం తో వ్యక్తి మృతి..వెల్‌నెస్ ఆసుపత్రిలో ‘కాసుల’ కక్కుర్తి!

ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళనవైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఆ ఆసుపత్రికి మాత్రం రోగి ప్రాణం కంటే కాసులే పరమావధి అయ్యాయి.

మనిషి ప్రాణం పోయిందని తెలిసి కూడా.. ఆ నిజాన్ని దాచిపెట్టి, చివరి రూపాయి వరకు వసూలు చేశాకే మరణవార్తను బయటపెట్టిన అమానవీయ ఘటన నిజామాబాద్ నగరంలోని వెల్‌నెస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడ్ల అశోక్ అనే యువకుడు గత నెల 26న ప్రమాదవశాత్తు కింద పడటంతో గాయాల పాలయ్యాడనీ వెంటనే కుటుంబ సభ్యులు అతడిని వెల్‌నెస్ ఆసుపత్రిలో చేర్పించారన్నారు.

పరిస్థితి విషమిస్తుందని భావించిన బంధువులు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తామని వేడుకున్నారనీ అన్నారు. అయితే, “మా దగ్గర అత్యాధునిక వైద్యం ఉంది.. రెండ్రోజుల్లో పేషెంట్ నడుచుకుంటూ వెళ్తాడు” అని యాజమాన్యం నమ్మబలికారని తెలిపారు. వారి మాటలు నమ్మిన పేద కుటుంబం అప్పులు చేసి మరీ ఆసుపత్రిలో ఉంచారు.

బుధవారం పేషెంట్ పరిస్థితిపై ఆరా తీయగా.. “ఆరోగ్యం చాలా బాగుంది.. ముందు పాత బాకీలు, మెడికల్ బిల్లులు క్లియర్ చేయండి.. ఆ తర్వాతే పేషెంట్‌ను చూపిస్తాం” అని సిబ్బంది కరాఖండిగా చెప్పారనీ తెలిపారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అడిగినంత నగదు చెల్లించారు.

బిల్లులు చేతికి అందగానే.. “మీ పేషెంట్ చనిపోయాడు” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంటే, ప్రాణం పోయిన విషయం ముందే తెలిసినా.. కేవలం డబ్బుల కోసమే గంటల తరబడి శవాన్ని ఉంచుకుని నాటకమాడారని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆసుపత్రి వర్గాలు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇంటి దగ్గర కింద పడిన వ్యక్తికి ఎం.ఎల్.సి తీసుకురావాలని మెలిక పెట్టారు. దీనిపై బంధువులు నిలదీయగా.. సమాధానం చెప్పలేక సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.

ఈ ఆసుపత్రిలో ఇలాంటి దారుణాలు జరగడం ఇదేం మొదటిసారి కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుకు నిరసనగా అశోక్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments