Sunday, April 26, 2026
HomeTelanganaNizamabadవికారాబాద్ శిక్షణ శిబిరం మాలో కొత్త స్ఫూర్తిని నింపింది- రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే రేవంత్...

వికారాబాద్ శిక్షణ శిబిరం మాలో కొత్త స్ఫూర్తిని నింపింది- రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం: డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం పాకులాడే వేదిక కాదని, కింది స్థాయి కార్యకర్తలకు, ఓటర్లకు సేవ చేసే సైన్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శిక్షణ శిబిర విశేషాలను, రాజకీయ పరిణామాలను సుదీర్ఘంగా వివరించారు.

ఫిబ్రవరి 21వ తేదీ నుండి వికారాబాద్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ శిబిరం అత్యంత కీలకంగా సాగిందని నగేష్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ సచిన్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇందులో పాల్గొని దిశానిర్దేశం చేశారన్నారు

“10 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం యోగా చేయించడంతో పాటు, దేశ స్వాతంత్రం తర్వాత దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రను వివరించారు” అని పేర్కొన్నారు.శిక్షణ శిబిరంలో తన రాజకీయ అనుభవాలను పంచుకుంటూ.. 1988లో తాను సర్పంచ్‌గా గెలిచిన సమయంలో తన గ్రామంలో నెలకొన్న తీవ్రమైన కుల వివక్షను గుర్తు చేసుకున్నారు.

“టీ హోటళ్లలో దళితులకు వేరే గ్లాసులు ఉంచేవారు. ఆ వివక్షను నిర్మూలించి అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలనే లక్ష్యంతో నాటి పంచాయతీలో మొదటి తీర్మానం కుల వివక్షకు వ్యతిరేకంగా చేశాను” అని శిబిరంలోని నేతలకు వివరించినట్లు తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కింది స్థాయి నుండి వచ్చిన కార్యకర్తలకు సర్వేలు చేసి డీసీసీలుగా నియమించారని నగేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. “డీసీసీలుగా ఉన్న మేము ఏ పెద్ద నాయకుడికో గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కింది స్థాయి కార్యకర్తలకు, ఓటర్లకు మాత్రమే మేము సేవకులం (గులాంగిరీ చేస్తాం) అని శిక్షణలో మాకు నేర్పారు” అని అన్నారు.

తెలంగాణను కేసీఆర్ తన దొంగ దీక్షలతో సాధించలేదని, సోనియా గాంధీ ఇస్తేనే రాష్ట్రం ఏర్పడిందని ఆయన విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు.

“దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి కేసీఆర్ గద్దెనెక్కి కూర్చున్నాడు. అభివృద్ధి శూన్యం చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారు” అని మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్.. నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 8 గెలుచుకున్నామని తెలిపారు.

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని, ఆ దిశగా కష్టపడి మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిపిస్తామని నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ తాహిర్ బిన్ హందాని పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!