తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్న ఈ వృత్తిని ప్రస్తుత తరంతోనే ముగించాలని, భవిష్యత్ తరాలకు ఇది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., అన్నారు. గురువారం నగరంలోని ఖలీల్ వాడిలో గల ‘స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిణి డి. పద్మ అనిల్‌తో కలిసి సిపి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. కుటుంబ పోషణ కోసం అనివార్య కారణాలతో ఈ వృత్తిలోకి వచ్చినప్పటికీ, దీనిపైనే పూర్తిగా ఆధారపడకూడదని సూచించారు.
“ఈ వృత్తి మీ తరంతోనే ఆగిపోవాలి. మీ పిల్లలు ఇదే బాటలో నడవకుండా, వారికి ఉన్నత విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఉంది” అని హితవు పలికారు.సెక్స్ వర్కర్లకు కూడా ప్రత్యేక హక్కులు ఉంటాయని, వారి రక్షణ కోసం పోలీస్ శాఖ, షీ టీమ్స్, భరోసా సెంటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని సిపి స్పష్టం చేశారు.
“మీ వద్దకు వచ్చే వారు మత్తు పదార్థాలు వాడి దౌర్జన్యాలకు పాల్పడితే సహించబోం. దాడులకు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.జిల్లా సంక్షేమ అధికారిణి డి. పద్మ మాట్లాడుతూ.. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
అనంతరం విశేష సేవలు అందించిన సిబ్బందిని, పీర్ ఎడ్యుకేటర్లను, మహిళా సెక్స్ వర్కర్లను అతిథులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్నేహ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సిద్దయ్య, వయోజన విద్య సహాయ సంచాలకులు ఏ. పురుషోత్తం, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ. వికాస్, డిపిఎం సుధాకర్, సిపిఓ మొయిజ్ అహ్మద్, సఖి సెంటర్ ప్రతినిధి భానుప్రియ, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం గుప్తా, ప్రాజెక్ట్ మేనేజర్ శివ తదితరులు పాల్గొన్నారు.
