నిజామాబాద్, మార్చి 09 : బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూల్ లను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు.
స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా మోడల్ స్కూల్ కేర్ టేకర్ ఎం.వీణ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయి, పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేర్ టేకర్ రెగ్యులర్ గా విధులకు హాజరు కారని, తమ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, హాస్టల్ లో నీటి కొరత తీవ్ర స్థాయిలో నెలకొని ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని, కేర్ టేకర్ అసంబద్ధ వైఖరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బాలికలు ముక్త కంఠంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
సదరు కేర్ టేకర్ తమను కూడా పరుష పద జాలాలతో దూషిస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మోడల్ స్కూల్ సిబ్బంది సైతం కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, మోడల్ స్కూల్ కేర్ టేకర్ వీణ తీరుపై తక్షణ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీ.ఈ.సీ.ఓ భాగ్యలక్ష్మి, ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లు విచారణ జరిపి నివేదిక సమర్పించారు.
వారి నివేదిక ఆధారంగా కేర్ టేకర్ వీణను విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ స్కూల్ లో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు కలెక్టర్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. పదవ తరగతి గదిని సందర్శించి, విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి, వారి అభ్యాసనా సామర్ధ్యాలను అంచనా వేశారు.
సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందిస్తూ, చాక్లెట్ బాక్సులు అందజేశారు. పరీక్షలు సమీపించినందున ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని, కేవలం పాస్ మార్కులు కాకుండా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలని స్ఫూర్తి కలిగించారు.
గతేడాది 100 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని ప్రిన్సిపాల్ తెలుపగా, ఈసారి కూడా శత శాతం ఫలితాలు వచ్చేలా విద్యార్థినులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపరచాలని అన్నారు.
