కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవడానికి ‘లోక్ అదాలత్’ ఒక అద్భుతమైన అవకాశమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న ‘జాతీయ లోక్ అదాలత్’ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాజీ పడదగ్గ నేరాల్లో ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులకు సంబంధించి కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం ఉండటమే కాకుండా, ఇక్కడ వెలువడే తీర్పుపై తిరిగి అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని, దీంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు. పరస్పర అంగీకారంతో రాజీ పడదగ్గ మైనర్ క్రిమినల్ కేసులు.ఆస్తి తగాదాలు, చెక్కు బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు.భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలు, ఇతర సివిల్ డిస్ప్యూట్లు.
సమయాన్ని ఆదా చేసుకోండి..
న్యాయస్థానాల చుట్టూ తిరిగే పని లేకుండా, తక్కువ సమయంలో, ఎటువంటి ఖర్చు లేకుండా కేసులను ముగించుకోవచ్చని సీపీ సూచించారు. కక్షిదారులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో లేదా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్‌లో ఉంచుకునేలా చొరవ చూపాలని కోరారు.
