ఐపీఎల్ వేళ నడిగడ్డలో జోరుగా జూదం..బంతి బంతికి పందెం.. రెట్టింపు లాభాల ఆశ!జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఐపీఎల్ సందడి మొదలవడంతో కేటుగాళ్లు తమ నెట్‌వర్క్‌ను ముమ్మరం చేశారు.
‘పది రూపాయలు పెడితే వంద వస్తాయి.. వంద పెడితే వెయ్యి వస్తాయి’ అంటూ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు. తీరా ఆ ఉచ్చులో చిక్కుకున్నాక, లక్షల రూపాయల అప్పులపాలై, వాటిని తీర్చలేక పచ్చని యువత నిలువునా బలైపోతోంది.
గతేడాది జిల్లాలో జరిగిన వరుస ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనం.ఒకప్పుడు రహస్యంగా సాగే బెట్టింగ్‌లు, ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోనూ తిష్టవేశాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్నారు.
బంతి బంతికి పందెం..టాస్ ఎవరు గెలుస్తారు? మొదటి బంతికి ఎన్ని పరుగులు వస్తాయి? ఈ ఓవర్‌లో వికెట్ పడుతుందా? ఇలా ప్రతి అంశంపై పందెలు కాయడం పరిపాటిగా మారింది. ఒక్కో సందర్భంలో వేసిన మొత్తానికి 5 నుంచి 10 రెట్ల వరకు లాభం వస్తుందని ఆశ చూపడంతో విద్యార్థులు, నిరుద్యోగులు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును కూడా జూదానికి అర్పిస్తున్నారు.
తొలుత చిన్న మొత్తాల్లో లాభాలు వచ్చేలా చేసి, అలవాటు పడ్డాక పెద్ద మొత్తంలో పందెలు వేయిస్తారు. చేతిలో డబ్బులు అయిపోగానే, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. తీరా మ్యాచ్‌లు ఓడిపోవడంతో లక్షల రూపాయల బాకీలు పేరుకుపోతున్నాయి.
అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడం, కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిస్తే పరువు పోతుందన్న భయంతో జిల్లాలో కొందరు యువకులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
