ఆర్మూర్ పట్టణ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. శనివారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై సుదీర్ఘంగా చర్చించారు. పట్టణంలో ఎక్కడైతే సిసి రోడ్లు, బీటీ రోడ్ల అవసరం ఉందో వాటిని వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
మురుగునీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయాలన్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.మున్సిపల్ కార్యాలయాల్లో పనుల కోసం సామాన్య ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. జర్నలిజం పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని చెబుతూనే, కొందరు వ్యక్తుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులు అభివృద్ధి పనుల్లో మాకు సహకరించాలి. అయితే, ఒకరిద్దరు వ్యక్తులు మీడియా పేరు చెప్పుకుని సామాన్య ప్రజలను బెదిరిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఇలాంటి వారి వల్ల నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తోంది. అక్రమాలకు పాల్పడే వారిని మీడియా మిత్రులు గుర్తించి అడ్డుకోవాలి అని అన్నారు.
పట్టణ అభివృద్ధికి మీడియా నిర్మాణాత్మకమైన సలహాలు అందించాలని, తప్పులు ఉంటే ఎత్తిచూపుతూనే ప్రజలకు మేలు జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
