ఇందూరు జిల్లా వ్యాప్తంగా తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, దళారుల దోపిడీని అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని ఆయన కోరారు.
ప్రస్తుత సీజన్‌లో జిల్లావ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులు పండించిన ధాన్యం ఎప్పటికప్పుడే కల్లాలకు చేరుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
జిల్లాలో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల పంట నేలకొరిగి కల్లాల్లోనే ధాన్యం తడిసిపోతుంటే, ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రైతులు క్వింటాలుకు రూ. 200 నుండి రూ. 300 వరకు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు, దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. జిల్లావ్యాప్తంగా ఐకేపీ, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలి. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ప్రతి కేంద్రంలో తగినన్ని గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలి.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలను ఏర్పాటు చేయాలి.తేమ, తరుగు పేరుతో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదు.ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనేలా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
రైతులను ఆదుకోని యెడల, బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
