క్షణికావేశంలో కొడవలితో భర్తపై భార్య దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి లో శనివారం రాత్రి జరిగింది . భర్త మృతి చెందడం భార్య జైలుకు వెళ్లడంతో వారిద్దరి పిల్లలు అనాథలైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణ శివారులోని వాంబే కాలనీకి చెందిన కోదండ శివ (30) అతని భార్య లక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది.
దీంతో కోపోద్రిక్తురాలైన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో భర్తపై దాడి చేసి దారుణంగా హత్య చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే వీరికి సంవత్సరం, రెండేళ్ల ఇద్దరు చిన్న ఆడ పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని జి జి హెచ్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
