ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటననగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో కొనసాగుతున్న పారిశ్రామిక ప్రదర్శనలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వచ్చిన ఓ మహిళ.. గాలిలో ఊగే ఉయ్యాల (బోట్ స్వింగ్)పైనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం రాత్రి జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేష్వర్ గ్రామానికి చెందిన కళ్యాణి అనే మహిళ, రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్‌కు విచ్చేశారు. అక్కడ ఉన్న వివిధ రకాల రైడ్లను ఆస్వాదిస్తూ, కుటుంబంతో కలిసి పెద్ద ఉయ్యాల ఎక్కారు.
అది వేగంగా ఊగుతున్న సమయంలోనే కళ్యాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఉయ్యాల కదులుతుండగానే ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఉయ్యాల ఆగిపోయే సమయానికి కళ్యాణి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో కిందికి దించారు.
అప్పటికే ఆమె స్ప్రుహ లో లేకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కళ్లముందే ప్రాణపాయ స్థితిని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కన్నీరు పెట్టించాయి. ఈ విషాద ఘటనతో ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు.
