పోలీసు అధికారిగా అవతారమెత్తి వాహనదారులను బురిడీ కొట్టిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ సీఐ సిహెచ్. శ్రీనివాస్ వెల్లడించారు.
డిచ్పల్లి మండలం మెంటరాజ్పల్లి గ్రామానికి చెందిన చౌహాన్ గణేష్ (32) అనే వ్యక్తి గురువారం (మే 14) నాడు పోలీసు ప్యాంటు ధరించి తన పల్సర్ బైక్ (TG 16 E 0926)పై ఖానాపూర్ చౌరస్తాకు చేరుకున్నాడు.
అక్కడ తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ.. అటుగా వెళ్తున్న వాహనదారులను ఆపి హెల్మెట్ లేదని, వాహన పత్రాలు సరిగ్గా లేవంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
గణేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను పోలీసుగా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
