HomeCRIMEట్రేడ్ లైసెన్స్ పేరుతో సైబర్ వల..అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..

ట్రేడ్ లైసెన్స్ పేరుతో సైబర్ వల..అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..

నిజమాబాద్ నగరంలోని వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. మున్సిపల్ అధికారుల పేరుతో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ వాట్సాప్‌లో నకిలీ సందేశాలు పంపిస్తూ, వాటితో పాటు క్యూఆర్ కోడ్‌ను పంపి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు.

ఈ సందేశాలను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒ ప్రకటన విడుదల చేశారు.

గత రెండు రోజులుగా 9492219684 మొబైల్ నంబర్ నుంచి వ్యాపారులకు వాట్సాప్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపుతున్నట్లు తెలిపారు.

సందేశంలో క్యూఆర్ కోడ్‌ను జతచేసి వెంటనే చెల్లింపు చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సందేశాలకు నగరపాలక సంస్థతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్ల మోసపూరిత చర్యేనని స్పష్టం చేశారు.

ట్రేడ్ లైసెన్స్ ఫీజు లేదా ఇతర మున్సిపల్ పన్నుల చెల్లింపుల విషయంలో సందేహాలు ఉంటే నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వ ఫీజులను అధికారిక ప్రభుత్వ పోర్టల్‌లు లేదా మున్సిపల్ కౌంటర్లలో మాత్రమే చెల్లించాలని, వాట్సాప్‌లో వచ్చే లింకులు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హెచ్చరించారు.

ఇలాంటి మోసపూరిత సందేశాలు అందిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలను అరికట్టవచ్చని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments