ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసి బీభత్సం సృష్టించింది.
ఊహించని విధంగా ముంచెత్తిన ఈ వర్షం, ఎంతో కష్టపడి పంటలు కోసి విక్రయాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది.
ముఖ్యంగా ధర్పల్లి మండలంలో అత్యధికంగా 54.4 మి.మీల భారీ వర్షపాతం నమోదు కాగా, సిరికొండలో 34.1 మి.మీ, మోర్తాడ్‌లో 32.0 మి.మీ, భీమ్‌గల్‌లో 26.8 మి.మీ, కమ్మర్‌పల్లిలో 24.0 మి.మీ, ఎర్గట్లలో 17.9 మి.మీ, డిచ్‌పల్లిలో 16.0 మి.మీ, ఇందల్వాయిలో 15.0 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 274.4 మి.మీల వర్షం కురవగా.. సగటున 8.3 మి.మీల వర్షపాతం నమోదైంది. ఇటీవలే కోతలు ముగించుకుని, విక్రయాల కోసం జిల్లాలోని మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు ఈ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
చాలా చోట్ల తూకాల కోసం సిద్ధంగా ఉంచిన ధాన్యపు రాశులు నీటిలో నానిపోయాయి. అకాల గాలుల ధాటికి కప్పిన తార్పాలిన్లు కొట్టుకుపోవడంతో రైతులు చూస్తుండగానే పంట నానిపోయింది. మరికొన్ని లోతట్టు కేంద్రాల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆరబోసిన గింజలు నీట మునిగాయి.
అటు కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటలపై కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం పడింది. గాలుల ధాటికి పలుచోట్ల మామిడి కాయలు పెద్ద ఎత్తున నేలరాలడంతో తోటల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కంటికి రెప్పలా కాపాడుకుని, కోతలు కోసి మార్కెట్‌కు తెస్తే.. తూకం వేసేలోపే వాన దేవుడు కడుపు కొట్టాడని, ఇప్పుడు ఈ తడిసిన గింజను కొంటారో లేదోనని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అకాల వర్షం సృష్టించిన ఈ నష్టాన్ని ప్రభుత్వం గమనించి, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్నలను ఎలాంటి ఆంక్షలు లేకుండా, మద్దతు ధరకే కొనుగోలు చేసి తక్షణమే తమను ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం అధికారులను వేడుకుంటోంది.
