నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని సాయి రాజలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్ మిల్లును కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లు ఆవరణలో ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, ఎక్కువ సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని, అన్ లోడింగ్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటదివెంట దిగుమతి చేసుకోవాలని మిల్లు నిర్వాహకులకు సూచించారు. లేనిపక్షంలో ఆరు బయట, కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు.
అన్ లోడింగ్ లో జాప్యానికి తావులేకుండా పర్యవేక్షణ జరపాలని, రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం ప్రవీణ్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల నిర్వాహకులు తదితరులు ఉన్నారు.
