మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, అందుబాటులోకి రానున్న సౌకర్యాలపై అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి ఆయన సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
సిబ్బంది కోసం కార్యాలయ గదులు, రిసెప్షన్ సెంటర్, రికార్డు గదులతో పాటు మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి, రూరల్ సీఐ జాన్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, ముప్కాల్ ఎస్సై కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
