తాళాలు వేసి ఉన్న ఇళ్లే కాకుండా భక్తుల నమ్మకాలకు నిలయమైన ఆలయాలను సైతం వదలకుండా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ ఆర్ఆర్ చౌరస్తాలో గల హనుమాన్ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు అలజడి సృష్టించారు.
ఆలయ హుండీని పగలగొట్టి పెద్ద మొత్తంలో నగదును అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే..రోజులాగే రాత్రి పూజలు ముగించుకుని అర్చకులు, నిర్వాహకులు ఆలయ తలుపులకు తాళాలు వేసి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు.. ఆలయ ప్రాంగణంలో ఉన్న హుండీ తాళాలను పగలగొట్టారు.
అందులో భక్తులు సమర్పించిన కానుకలను గుల్ల చేశారు. సుమారు రూ. 15,000 వరకు నగదు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు, భక్తులు హుండీ పగలకుట్టి ఉండటం గమనించి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
వెంటనే ఆలయ కమిటీ సభ్యులు రెండవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలను సేకరించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
