దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు, అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ పన్నుతున్న అంతర్గత కుట్రలను క్షేత్రస్థాయిలోనే బద్దలు కొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఓట్ల తొలగింపు వంటి వెన్నుపోటు రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్న కమలనాథుల వ్యూహాలపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ (ఇందిరా భవన్) లో ఏఐసీసీ శిక్షణ విభాగం ఆధ్వర్యంలో ‘ఎస్‌ఐఆర్’, ‘బీఎల్‌ఏ-2 లపై ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనీల శిక్షణా సదస్సుకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి అత్యంత పకడ్బందీగా బలోపేతం చేశామని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో బీఎల్‌ఏల (బూత్ లెవల్ ఏజెంట్లు) నియామకాలను పూర్తి చేశామని వెల్లడించారు.
జిల్లా, మండల కమిటీల ఏర్పాటు సైతం దాదాపు కొలిక్కి వచ్చిందని, రాబోయే ఏ ఎన్నికలకైనా పార్టీ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. బీజేపీ మార్క్ దగా రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గతంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అడ్డగోలు కుట్రలకు తెరలేపింది.
ఏకంగా 93 లక్షల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, ఆ తర్వాత కేవలం 30 లక్షల ఓట్లను మాత్రమే పునరుద్ధరించింది. మిగిలిన 60 లక్షల ఓట్లను గల్లంతు చేయడం ద్వారా అక్కడ ప్రభుత్వాలనే మార్చేసేలా తెరవెనుక దారుణమైన కుట్రలు చేసింది” అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడైనా ఇటువంటి విషపూరిత రాజకీయాన్నే బీజేపీ నమ్ముకుందని దుయ్యబట్టారు.
తెలంగాణ గడ్డపై అలాంటి కుట్రలకు ఏమాత్రం తావులేకుండా చూడాలని, ప్రతి ఓటును నిశితంగా పరిశీలిస్తూ ఓటుబ్యాంకును కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం పార్టీ భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని, ఇక్కడ నేర్చుకున్న వ్యూహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఏఐసీసీ జాతీయ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిష్ణాతులైన ట్రైనర్లు సౌరబ్, నిశాంత్, అనూషలు గాంధీభవన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ట్రైనీలకు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటర్ల జాబితా పరిశీలన, బూత్ స్థాయి సమన్వయంపై ఇక్కడ శిక్షణ పొందుతున్న మాస్టర్ ట్రైనీలు..
త్వరలోనే ఆయా నియోజకవర్గాల పరిధిలోని బీఎల్‌ఏలకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు, శిక్షకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
